కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన అనాధ బాలికల నిధులను వీరంరెడ్డి ముత్యాల రావు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత బాలికల మాటలు ఎవరూ వినకపోవడంతో వారు మౌనంగా ఉన్నా, గ్రామస్తుల ప్రోత్సాహంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 2015లో తండ్రి, 2017లో తల్లి, కోవిడ్ సమయంలో తాత మరణించడంతో బాలికలు పూర్తిగా అనాథలుగా మారారు.
చంద్రన్న భీమా పథకం ద్వారా వారికి ₹1,95,000 నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల కోసం బ్యాంకు ఖాతా అవసరమని చెప్పి ముత్యాల రావు, కరప మండలం అరట్లకట్ట గ్రామంలోని బ్యాంకులో చక్రమ్మ పేరుతో ఖాతా తెరిచాడు. బాలికలు మైనర్లవ్వడంతో తనను సంరక్షకుడిగా నమోదు చేయించుకున్నాడు. తర్వాత చెక్కులపై బాలికల సంతకాలు తీసుకుని, అకౌంట్ బుక్, చెక్ బుక్ తన దగ్గర ఉంచుకుని మొత్తం డబ్బును స్వాహా చేశాడు.
అంతేకాక, బాలికలకు అమ్మ ఒడి పథకం కింద వచ్చిన డబ్బును తన కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేయించుకున్నాడు. తమ చిన్న ఇంటిని కూడా అద్దెకు ఇచ్చి డబ్బును తన ప్రయోజనానికి వాడుకున్నాడని బాలికలు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు లేని తమను ఇలా మోసం చేయడమే కాకుండా, అవసరానికి 500 రూపాయలు అడిగినా దురుసుగా వ్యవహరించి ఇంటి దారి పట్టించారని చక్రమ్మ వాపోయింది.
ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నా, ఇప్పుడు తమ న్యాయం కోసం ముందుకు వచ్చామని బాలికలు తెలిపారు. స్థానిక గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీ తమకు న్యాయం చేయాలని బాలికలు వేడుకుంటున్నారు. తమ హక్కు డబ్బును తిరిగి ఇప్పించి, ముత్యాల రావుకు శిక్ష పడేలా చూడాలని వారు కోరుతున్నారు.