ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రైబల్ కల్చరల్ మీట్ 2024-25 కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులు చిత్రించిన ఛాయచిత్రాలను తిలకించి వారికి అభినందనలు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అంతేగాక, విద్యార్థులతో కలిసి గుస్సాడీ నృత్యాలు చేసి వారికి ఉత్సాహాన్ని అందించారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు సమాజానికి తెలియజేయడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలెక్టర్‌తో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆదివాసీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థులకు తమ ఆశీర్వాదాలు అందజేశారు. కళ, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేలా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
