H-1B Visa: అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి సంస్థలో పనిచేస్తున్న H-1B ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
PERM ప్రక్రియ వేగవంతం
గూగుల్ అంతర్గత మెమో ప్రకారం, అర్హత కలిగిన ఉద్యోగులకు 2026లో PERM (Program Electronic Review Management) దరఖాస్తుల ప్రక్రియను వేగంగా చేపట్టనుంది. PERMకు అర్హత సాధించిన ఉద్యోగులకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఇమిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి సంప్రదింపు వస్తుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై గూగుల్ అధికారిక ప్రకటన చేయలేదు.
ALSO READ:Bomb Threats | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్
PERM అంటే ఏమిటి?
ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో PERM కీలక దశ. విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల అమెరికన్ ఉద్యోగులకు నష్టం జరగదని, ఆ ఉద్యోగానికి అర్హులైన అమెరికన్లు లేరని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. లేఆఫ్‌లు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియను కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారుతుంది.
లేఆఫ్‌ల ప్రభావం
2023లో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించడంతో PERM దరఖాస్తులను నిలిపివేసింది. ఆ సమయంలో అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని గూగుల్ భావిస్తోంది.
అర్హత షరతులు
ప్రతి విదేశీ ఉద్యోగి PERMకు అర్హుడు కాడు. డిగ్రీ, పని అనుభవం, సీనియార్టీ, పనితీరు కీలకం. గూగుల్ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకే ఈ అవకాశం వర్తిస్తుంది. రిమోట్ ఉద్యోగులు అర్హత పొందాలంటే నివాస ప్రదేశం మార్చుకోవాల్సి ఉంటుంది.
