2009వ సంవత్సరంలో ఒడిశాలోని లఖిరేఖల్ అడవుల నుండి వచ్చిన ఏనుగుల గుంపు ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండ నియోజకవర్గంలో పంటల నష్టాలను కలుగజేస్తూ 11 మంది ప్రాణాలను హరించింది. అప్పటి ప్రభుత్వాలు హడావుడిగా స్పందించినప్పటికీ, కాలగమనంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. ప్రస్తుతం భామిని మండలంలో వంశధార నది పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలపై తీవ్ర నష్టాలను కలిగిస్తోంది.
గత వారం రోజులుగా భామినిలోని రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరి కుప్పలు, నూర్పు చేసిన ధాన్యం, పత్తి వంటి పంటలు ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. గిరిజనులు మరియు రైతులు ఆందోళన చెందుతున్నారు. భామిని గ్రామానికి చెందిన గురుబిల్లి చలం నాయుడు 50 సెంట్లలో పండించిన పంటలు నష్టపోయి, సుమారు 50 బస్తాల ధాన్యం రాసులు నాశనం చేయబడ్డాయి.
అదే గ్రామానికి చెందిన గురుబిల్లి బాలకృష్ణ పంటల మీద కూడా తీవ్ర నష్టాలు కలిగాయి. పత్తి, ధాన్యం వంటి పంటలను ఏనుగులు పూర్తిగా చిందరవందరగా చేసి రైతులకు నష్టాలను మిగిల్చాయి. రెండు బస్తాల పత్తి పంట కూడా పూర్తిగా నాశనం అయింది. ఈ విధంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది.
రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ, అటవీ శాఖలు వెంటనే ఈ నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం అందించాలని బుడితి అప్పలనాయుడు కోరారు. ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించి రైతులు, ప్రజలు, మూగజీవాల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.