మహాశివరాత్రి సందర్భంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శివ భక్త సేవా సమితి భక్తులకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు, ఆలయ ప్రాంగణంలో భజనలు, శివనామస్మరణం నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు.
రేపు స్వామివారి రధోత్సవం వైభవంగా జరగనుంది. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రథోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు, వేద పారాయణం, మహాదీపారాధనలు నిర్వహించనున్నారు.