నిజాంపేట మండలంలోని బచ్చురాజుపల్లి గ్రామానికి కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా నీటి విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాసంగి పంట కోసం ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల రైతులు ఉపశమనం పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నీటి విడుదలకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ యువజన నాయకుడు వినోద్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా పని చేస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు వాస్తవ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
యాసంగి పంట కాలంలో పొలాలు ఎండిపోకుండా ముందుగా నీటిని విడుదల చేయడం రైతులకు గొప్ప ఉపశమనంగా మారిందన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా ముందస్తుగా నీటి విడుదల చేయడం వల్ల పంటలకు జీవం లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. నీటి అందుబాటు వల్ల దిగుబడి పెరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోనే విపరీతమైన అభివృద్ధి సాధ్యమైందని, అయినా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమచేస్తూ, రుణమాఫీ అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు రాజు నాయక్, సూర్య నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.