రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బి.వై.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐజా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అర్హుల ఎంపిక ప్రాతిపదిక, సేకరించిన వివరాల ప్రామాణికత, రిజిస్టర్లలో నమోదు వంటి అంశాలను అధికారులతో సమీక్షించారు.
ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా పూర్తవ్వాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సూచించారు. రైతు భరోసా పథకానికి సంబంధించి భూసేకరణ, లే అవుట్, వ్యవసాయ యోగ్యత వంటి అంశాలను పరిశీలించాలని, భూభారతి (ధరణి) పోర్టల్, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా భూముల వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం ఐజా మండలంలోని వివిధ సర్వే నంబర్ల పరిధిలోని భూములను స్వయంగా పరిశీలించారు. కిష్టాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్, కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన కుటుంబాలను గుర్తించే విధానాన్ని వివరంగా పరిశీలించారు. పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు లేకుండా ఉండకూడదని, కొత్త పేర్ల చేర్పు విషయంలో కచ్చితంగా పరిశీలన జరిపించాలని తెలిపారు.
రైతు భరోసా పథకాన్ని కేవలం వ్యవసాయ యోగ్య భూములకే వర్తింపజేయాలని, డిజిటల్ సంతకం ఉన్న పట్టాదారుల భూముల్లో పంటల సాగు వివరాలను క్రాప్ బుకింగ్ ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సేకరించిన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.