ఆదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరిగిన పని ఒత్తిడి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు K రవికుమార్, R రాజశేఖర్, NCBE నాయకులు నాగరాజు, హరినాథ్, అనుమన్న గాయత్రి, AIBEA నేత ప్రాఫుల్ కుమార్, రిటైర్డ్ స్టాఫ్ సభ్యులు మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో తగిన నియామకాలు చేపట్టి పని ఒత్తిడిని తగ్గించాలని, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేతలు అన్నారు. అలాగే, అవుట్ సోర్సింగ్ నియామకాలపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని, స్థిరమైన ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో సమ్మె తప్పనిసరైందని పేర్కొన్నారు.
ఈ నిరసనలో ఏఐబీఏ, ఏఐబీఓసీ, NCBE యూనియన్ నేతలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం అన్ని బ్యాంకుల ఉద్యోగులు కలిసి రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు నిరసనలు కొనసాగుతాయని నేతలు హెచ్చరించారు.