ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవీ విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ తన 35 ఏళ్ల పోలీసు సేవను సంతోషంగా ముగిస్తున్నానని తెలిపారు. గత ఏడునెలలుగా డీజీపీగా సేవలు అందించానని, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు.
నేరాల నియంత్రణ కోసం టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. సైబర్ క్రైమ్ తప్ప మిగిలిన నేరాలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయని వెల్లడించారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.
ప్రజల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 25 వేల కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. డ్రోన్ల వినియోగాన్ని కూడా పెంచుతున్నామని తెలిపారు.
వరదల సమయంలో పోలీసులు అద్భుతమైన సేవలు అందించారని, భవిష్యత్తులో మరింత శ్రమించి ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సమయం గడపాలని ఉద్దేశించుకున్నానని పేర్కొన్నారు.