బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ప్రముఖ టీవీ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరయ్యారు. గతంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం ఆమెను అరెస్టు చేయొద్దని, కానీ విచారణకు సహకరించాల్సిందిగా సూచించింది.
ఈ కేసు నేపథ్యంలో శ్యామల ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ అధికారులు ఆమెను విచారించి, కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ కేసులో మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియ ఇప్పటికే విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాప్‌ల వల్ల యువత ఆకర్షితమై ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపణల నేపథ్యంలో విభిన్న రంగాల ప్రముఖులను విచారిస్తున్నారు.
ఈ కేసులో మరింత మంది సెలబ్రిటీలను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.