ఖమ్మం జిల్లా క్రిష్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు సైలో బంకర్ కాలుష్యం వల్ల ప్రాణాలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యను పరిశీలించేందుకు వచ్చిన ఓసి పిఓ నరసింహారావును స్థానికులు కమ్యూనిటీ హాల్లో బంధించి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు సమస్యను నిర్లక్ష్యం చేస్తూ జనాలను ముంచుతున్నారని ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కాలనీ ప్రక్కనే నిర్మించిన సైలో బంకర్ వల్ల అధికంగా ధూళి వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. కాలనీలో నివసించే వారిలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగాయని, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కష్టాలను వినాలని వచ్చిన అధికారులను అడ్డుకున్న కాలనీవాసులు, సమస్యల పరిష్కారం లేకుండా వెళ్ళిపోతే వాహనాలను విడుదల చేయమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఈ సమస్యను అతి తక్కువ కాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో సింగరేణి ఓసి పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు.
అధికారులు వెంటనే స్పందించి కాలనీవాసులకు న్యాయం చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.