కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆదిలాబాద్ ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించినా, అభివృద్ధి పరంగా ఒక్క పనికి కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. జీఎస్టీ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలకు బదులుగా బడ్జెట్‌లో గుండు సున్నా ఇచ్చారని విమర్శించారు.
జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్, సీసీఐ పునరుద్ధరణ, విమానాశ్రయ ఏర్పాటు, టెక్స్‌టైల్ పార్క్ లాంటి అభివృద్ధి పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. బడ్జెట్‌లో మార్పులు చేసి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభివృద్ధిలో విఫలమయ్యారని, నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.