అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం పిత్రిగెడ్డ గ్రామానికి అధికారులు క్యూ కట్టారు. బాలింతను డోలీలో కాలినడకన తరలించిన ఘటనపై జిల్లా యాంత్రాంగం స్పందించి ఆయా గ్రామాలకు అధికారుల్ని పంపించింది. కిల్లో దేవి అనే గిరిజన మహిళకు ప్రసవం అనంతరం బిడ్డకు ఆరోగ్యం బాలేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో సమీప ఆస్పత్రికి బయల్దేరింది. రోడ్డు మార్గం సరిగా లేక డోలీ మోతతోనే రెండు కి.మీ కాలినడకన, మరో నాలుగు కి.మీ బైక్‌పైనే తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంటి దగ్గరే డెలివరీ అయినప్పటికీ తల్లీబిడ్డ క్షేమం కోరుతూ దేవిని బుచ్చియ్యపేట పీహెచ్‌సీకి తరలించాల్సి వచ్చిందనే విషయాన్ని అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో పిత్రిగెడ్డ పీవీటీజీ గ్రామాన్ని నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్ శంకర్రావుతో పాటు ఆర్‌ఐ రామ్మూర్తి, స్థానిక పంచాయతీ అధికారులు శుక్రవారం పలు విషయాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానికులతో మాట్లాడారు. ఏఎన్‌ఎం ఆదేశాల మేరకే కిల్లో రాజు, రమేష్ అనే వ్యక్తులు బాలింత దేవిని ఆస్పత్రికి తరలించారని, రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతోనే డోలీలో తరలించాల్సి వచ్చిందని గ్రామస్తులు అక్కడి అధికారులకు స్పష్టం చేశారు.
లెక్కలన్నీ తప్పులే:
గ్రామాన్ని సందర్శించిన ఆర్‌డీవోకు షాక్ తగిలేలా ఆ ప్రాంత వాసులు పలు విషయాల్ని తెలియజేశారు. తమ ప్రాంతంలో రోడ్డు పనుల పేరిట అప్పటి అధికారులు రూ.26లక్షలతో ఖర్చు చూపించి, అసలు పనులే చేయలేదని చెప్పుకొచ్చారు. ఆ అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో..విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఆర్‌డీవో హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
రోడ్డు పర్యవేక్షణలో రాష్ట్రానికి చేదు అనుభవం
