తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త అందించింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ మినహాయింపును ప్రకటించింది. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజును 100 శాతం తగ్గించే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విధానం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడింది. గత పరిమితులను తొలగించి, రెండేళ్ల పాటు పన్ను మినహాయింపును పొడిగిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన ప్రకారం, సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వాహన విధానం అమలులోకి వస్తుంది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు, టాక్సీలు, ఇంకా తేలికపాటి రవాణా వాహనాలకు భారీ ఉపశమనం లభిస్తుంది. ఇంతే కాకుండా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు కూడా ఈ ఆఫర్‌లో భాగంగా ఉంటాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నియంత్రించడానికి ముందడుగు వేసింది. మూడు వేల ప్రస్తుత బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. టీజీఆర్‌టీసీ బస్సులు మరియు కంపెనీల రవాణా అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ బస్సులపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కానీ వాణిజ్య అవసరాలకు వినియోగించే బస్సులకు మాత్రం ఈ మినహాయింపు లభించదు.
ఈ పథకం ద్వారా కారు కొనుగోలు దారులకు రూ. 1.40 లక్షల నుండి రూ. 1.90 లక్షల వరకు ఆదా అవుతుంది. బైకులు, కార్ల రిజిస్ట్రేషన్ ఫీజులు రూ. 1500 నుంచి రూ. 2,000 వరకు మిగులుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు శబ్ద, వాయు కాలుష్యాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.