పెండింగ్ బిల్లుల విడుదల కోసం శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ, మాజీ సర్పంచులు నిధుల కోసం ఏడాది కాలంగా కోరుతున్నా స్పందించకపోవడం సిగ్గుచేటు అని, అరెస్టులను ఖండిస్తున్నామని అన్నారు. సర్పంచుల కుటుంబాలు ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని హరీశ్ రావు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి ఖర్చు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరెస్టు చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన అంటే సేవ చేసిన వారిని అరెస్టు చేయడమా అని ప్రశ్నించారు. పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూనే, సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడం ఎందుకని నిలదీశారు.