సాయిపల్లవి సహజమైన నటనకు కేరాఫ్ అడ్రెస్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి సాయిపల్లవి తాజా చిత్రంగా ‘అమరన్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘మేజర్ ముకుంద్ వరదరాజన్’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సాయిపల్లవి ‘గ్రేట్ ఆంధ్ర’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఇది ఒక బయోపిక్ .. ఒక జవాన్ కి వృత్తి పరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. దేశం కోసం పోరాటం చేసే అతనికి ఫ్యామిలీ వైపు నుంచి ఎంతటి సపోర్ట్ ఉంటుందనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది” అని చెప్పారు. ఆమె పాత్రపై ఆమె మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను ఏ పాత్రనైతే చేస్తున్నానో, నిజ జీవితంలో వారితో 3 గంటల పాటు మాట్లాడిన తరువాత ఒక అవగాహనకి వచ్చాను” అని వెల్లడించింది.
“ఒక ఆర్మీ మెన్ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయనేది నాకు అర్థమైంది. నటిస్తుంటేనే నాకు ఏడుపు వచ్చిందంటే, ఇక రియల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు. సోల్డియర్ ను పెళ్లి చేసుకోవలసి వస్తే భయంగానే అనిపిస్తుంది. తప్పదు అంటే నేను స్ట్రాంగ్ అవుతాను .. ‘నీతో పాటు నేను కూడా వస్తాను’ అని చెబుతాను” అని సాయిపల్లవి తన భావాలను వ్యక్తం చేసింది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని నమ్మకంగా చెప్పింది.