అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వర్షం కారణంగా నేలకొరిగిన పంటకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..! అకాల వర్షానికి తడిచి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రైతులకు రైతు భరోసా కింద ₹7500 చెల్లిస్తానన్న ప్రభుత్వం ఇప్పటికి ఆ ఊసే ఎత్తకపోవడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్ల లోనే కొరివి పెట్టడం పద్ధతి కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక కళ్యాణానికి కూడా తులం బంగారం ఇవ్వలేకపోయిందని మహిళలకు నెలకు 2500 ఇస్తానని ఆశ చూపి నేడు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆశను అడిఆశ చేసిందని ఆమే దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, చైర్మన్ సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాగా రెడ్డి, అయ్యోరి లక్ష్మణ్, చిలుక నాగరాజు, గోవర్ధన్ రెడ్డి, దయానంద్ యాదవ్, బిక్షపతి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
