కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామ సచివాలయ వాలంటీర్లు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు బద్వేల్ కమిషనర్‌కు మరియు టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డికి అర్జీ సమర్పించారు.
వాలంటీర్లు తమ జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే నిరసనలకు సిద్ధమని చెప్పారు.
ఏపీ ప్రజా వాలంటరీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ, పాత ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిందని, 2,60,000 వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదు నెలలుగా వాలంటీర్లకు జీతాలు రాలేదని, వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని వెంకట్ విన్నవించారు.
వాలంటీర్లకు జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఆ మాట అమలు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
జీతాలు చెల్లించకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని, వాలంటీర్లు ఆందోళనకు సిద్దంగా ఉన్నారని వెంకట్ హెచ్చరించారు.