ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ హాకీ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది, అయితే వారి నగదు బహుమతి వివాదాస్పదమైంది.
పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 100 డాలర్ల (రూ. 8,366) బహుమతి ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిర్ఘాంతపోయారు.
పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు మీర్ తారిక్ బుగ్తీ ఈ బహుమతిని ధృవీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. జట్టు ప్రదర్శనకు ప్రోత్సాహం ఇవ్వడానికే ఈ నగదు పురస్కారం అని అన్నారు.
అయితే, ఈ మొత్తంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా తక్కువ మొత్తాన్ని ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నగదు బహుమతిని అసలు ఇవ్వకపోతే బాగుండేది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంత మంచి ప్రదర్శన చేసిన జట్టుకు ఇలా తక్కువ ఇవ్వడం అన్యాయం అంటున్నారు.
చైనాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ కంగుతింది. పెనాల్టీ షూటౌట్‌లో ఘోర పరాజయం పాలైంది.
ఆ తర్వాత కాంస్య పతక పోరులో కొరియాను 5-2తో ఓడించి టోర్నమెంట్‌లో మూడో స్థానాన్ని సాధించింది.
మరోవైపు, ఫైనల్లో చైనాను ఓడించి భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.