బీఎస్ఎన్ఎల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్స్

బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం రూ.108, రూ.249 ధరలతో రెండు కొత్త ప్లాన్లను విడుదల చేసింది. 28, 45 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 1GB, 2GB డేటా, ఉచిత ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) దాదాపు రెండు నెలల కిందట టారిఫ్ ప్లాన్ల రేట్లను అమాంతం పెంచాయి. దాదాపు 15 శాతం మేర హెచ్చించాయి. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్ల ఆదరణ పెరుగుతోంది. చౌక ధరలకే చక్కటి ప్రయోజనాలు అందించే ఆఫర్లు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా ఉంది. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను కంపెనీ విడుదల చేసింది.

రూ.108, రూ.249 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4జీ ఇంటర్నెట్ వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రూ. 108 ప్లాన్ వివరాలివే..
అత్యంత చౌక అయిన రూ.108 ప్లాన్‌లో కస్టమర్లు 28 రోజుల పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. నేషనల్ రోమింగ్‌‌ను కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. అంతేకాదు 1 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం అందుబాటులో లేదు.

రూ. 249 రీఛార్జ్ బెనిఫిట్స్ ఇవే..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. నేషనల్ రోమింగ్‌తో పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా పొందవచ్చు. అంతేకాదు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *