తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక చేశారు. ఈ నెల 5న (గురువారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తెలంగాణలోని ఎనిమిది రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేసింది. 

అప్రమత్తమైన ప్రభుత్వం..
వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సెలవులు పెట్టొద్దని, ప్రజలకు సేవలందించడంపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. కాగా, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు సెలవుల విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. 

ఆ ఎనిమిది జిల్లాలు..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మొత్తం 11 జిల్లాల్లో మోస్తరుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *