గుడ్లవల్లేరు కాలేజీ అమ్మాయిల రహస్య వీడియోలను విక్రయించిన విజయ్‌కుమార్ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణా జిల్లాలోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరా ఘటనలో అరెస్ట్ అయిన విజయ్‌కుమార్ గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. నిందితుడు విజయ్‌కుమార్ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ కేసులో అతడి ల్యాప్‌టాప్ ప్రధాన సాక్ష్యంగా ఉంది. దానిని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి మహిళా హాస్టల్ వాష్‌రూమ్‌లో దాచిపెట్టిన సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన 300కుపైగా ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. వీటిలో కొన్ని వీడియోలను నిందితుడి నుంచి కొందరు విద్యార్థులు కొనుగోలు చేసినట్టు కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే, గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణ మాత్రం హాస్టల్ ఆవరణలో ఎలాంటి హిడెన్ కెమెరా లభ్యం కాలేదని పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని చెప్పారు.
హిడెన్ కెమెరాలతో మహిళలను రహస్యంగా చిత్రీకరిస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులోని ప్రముఖ కాఫీషాప్‌లోని వాష్‌రూమ్‌లో ఓ మహిళ హిడెన్ కెమెరాను గుర్తించింది. కెమెరాను ఓ బ్యాగులో చుట్టి దానిని ఆన్ చేసి అక్కడి చెత్తబుట్టలో పెట్టి మహిళలను చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, తాజా ఘటనలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది