Sudha Murty: దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను నేటితరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. భవిష్యత్తును అర్థం చేసుకోవాలంటే చరిత్రపై అవగాహన ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లో జరుగుతున్న జైపుర్ సాహిత్య వేడుకలో పాల్గొన్న సందర్భంగా సుధామూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘చరిత్ర తెలియకపోతే భవిష్యత్తును అర్థం చేసుకోవడం కష్టం. దేశ విభజన అనేది ఒక తప్పుడు నిర్ణయం. భారత సంప్రదాయాలు, భాషలు తెలియని ఒక వ్యక్తి పెన్సిల్‌తో గీత గీసి సరిహద్దులు నిర్ణయించడం వల్ల కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం పడింది’’ అని సుధామూర్తి అన్నారు.
ALSO READ:India vs Bangladesh U19: టాస్ దగ్గరే టెన్షన్..షేక్‌హ్యాండ్ లేకుండానే అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్
ఆ విభజన కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు వలస వెళ్లినవారి బాధలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయని తెలిపారు.
తాను ఒకసారి పాకిస్థాన్‌లోని మ్యూజియం సందర్శించినప్పుడు విదేశీయురాలిగా ఎక్కువ ఫీజు వసూలు చేయడం తనను కలిచివేసిందని, ఒకప్పుడు అదే అఖండ భారతంలోని భాగమని గుర్తుచేసుకున్నారు.
ఈ భూమి, మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ సులభంగా రాలేదని, పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారని నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ఈ అంశాలన్నింటిని యువతకు వివరించేందుకే ‘ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్‌రింగ్స్’ అనే పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. తన మనవరాలు అనౌష్కశర్మను ఆధారంగా చేసుకుని ఆ కథను తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
