Tollywood Controversy: నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV), నటి మంచు లక్ష్మి వంటి వారు విమర్శలు చేయగా, నటి కరాటే కల్యాణి(Karate Kalyani) మాత్రం శివాజీకి మద్దతుగా నిలిచారు.
శివాజీకి మద్దతుగా కరాటే కల్యాణి
శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా హాజరవడం వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ముఖ్యంగా పిల్లల మనసులపై దుష్ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శివాజీ తన మాటలను పాలిష్‌డ్‌గా చెప్పలేకపోయి ఉండవచ్చని, కానీ ఆయన చెప్పిన అంశంలో నిజం ఉందని వ్యాఖ్యానించారు.
అనసూయ, చిన్మయిల స్పందనపై ఘాటు వ్యాఖ్యలు
నటి అనసూయ, సింగర్ చిన్మయిల స్పందనపై కల్యాణి తీవ్రంగా స్పందించారు. “నా శరీరం నా ఇష్టం” అనే వాదన పబ్లిక్ ఫంక్షన్లకు వర్తించదని, ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
అనసూయకు ఇద్దరు కొడుకులు ఉన్నారని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో వారు అసభ్యంగా దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే తల్లిగా అంగీకరిస్తారా అని సూటిగా ప్రశ్నించారు.
సోషల్ మీడియాపై ఆందోళన
పాపులారిటీ కోసమే ఈ విషయాన్ని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని, సోషల్ మీడియా పోర్న్ సైట్‌లుగా మారుతున్నా ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని కరాటే కల్యాణి నిలదీశారు.
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మరో పది సంవత్సరాల్లో సంస్కృతి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
