Anna Hazare Strike: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శలు చేసారు.
ఈ చట్టం ప్రజా సంక్షేమానికి అత్యంత ముఖ్యమైనదని, ప్రభుత్వం వరుసగా హామీలు ఇచ్చినా అమలు దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని హజారే పేర్కొన్నారు. ఈ దీక్ష తన జీవితంలోని చివరి నిరసన కావొచ్చని వ్యాఖ్యానించారు.
2022లో కూడా ఇదే డిమాండ్‌తో ఆయన నిరాహార దీక్ష నిర్వహించారు. ఆ సమయంలో ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించడంతో నిరసనను విరమించారు. ఆ తర్వాత రూపొందిన బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినప్పటికీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని హజారే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు ఏడు లేఖలు రాసినా స్పందన లేకపోవడం బాధాకరమని హజారే అన్నారు. లోకాయుక్త చట్టం అమలు ఎందుకు ఆలస్యం అవుతోందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హజారే దీక్ష నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీయడం ఖాయం.
