తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి పెద్దన్నగా సహకరిస్తే అన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే హైదరాబాద్ అభివృద్ధి వేగవంతమవుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి తోడు నగరానికి సమాంతరంగా మరో కొత్త నగరాన్ని స్థాపించాలనే దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్–2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
ALSO READ:Nitish Kumar Oath Ceremony:నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగతా కాలంలో పరస్పర సహకారం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారత్‌ను ఆర్థికంగా ముందంజ దేశంగా మార్చేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ లక్ష్యాలలో తెలంగాణ ముఖ్య భాగస్వామి అవుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
దేశ జీడీపీలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని కోరారు.
మోదీ గుజరాత్ మోడల్‌ను రూపొందించినట్లే తెలంగాణ కూడా తన ప్రత్యేక అభివృద్ధి మోడల్‌ను తీసుకువచ్చిందని, రాష్ట్రానికి కూడా అదే విధమైన సహకారం అందించాలని అన్నారు. సబర్మతి రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని ఉద్దేశ్యంగా చేసుకుని మోదీ చేసిన మార్పుల మాదిరిగా, తాము మూసీ పునరుద్ధరణను చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
