తెలంగాణలోకి వచ్చే వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫిట్నెస్ లేని, ఓవర్‌లోడింగ్ చేసిన వాహనాలు, దుమ్ము ధూళి వెదజల్లే ట్రక్కులను కఠినంగా తనిఖీ చేయాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు.ఇటీవలి కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరియు ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా భద్రతా చర్యలను బలపరిచే దిశగా విస్తృత తనిఖీలు చేపట్టాలని మంత్రి తెలిపారు.
ఈ చర్యల కోసం జిల్లాస్థాయిలో 33 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, రాష్ట్రస్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
అంతర్రాష్ట్ర వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు ఎటువంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.
