తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ జానపద కళాకారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో సుమారు లక్షా 50 వేల మంది కళాకారులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 5,500 మందికి పెన్షన్ ఇవ్వగలదని కవిత వివరించారు. కానీ ఈ అవకాశాన్ని ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని ఆమె విమర్శించారు.
“జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయనకు ఉద్యమం, కళలు, కళాకారుల విలువ తెలియదు,” అని కవిత అన్నారు.
ALSO READ:ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో చరణ్ భావోద్వేగం… నా కల నెరవేరింది
కళాకారుల సమస్యలపై కవిత ఆగ్రహం – ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శ
కళాకారుల సమస్యలపై మంత్రులను సంప్రదించినప్పటికీ, “కళాకారులు అంటే ఎవరని అడుగుతున్నారట. తెలంగాణలో పుట్టి కళాకారులను ఎవరని అడగటం సిగ్గుచేటు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి, పెన్షన్ రావడంలో సహకరిస్తామని కవిత తెలిపారు. ప్రభుత్వం జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

“జానపద అకాడమీ ద్వారా కళాకారులను గుర్తిస్తే, కేంద్రం నుంచి పెన్షన్లు సులభంగా వస్తాయి,” అని ఆమె చెప్పారు.
అలాగే సాంప్రదాయ కళాకారులను కూడా ప్రభుత్వం గుర్తించాలన్నారు. తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే వరకు జాగృతి పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే, కొత్త ప్రభుత్వం ద్వారా అందించేలా చేస్తాం,” అని కవిత స్పష్టం చేశారు.
