బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా CRPF యూనిట్లు ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దు లోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం హిద్మా వంటి అగ్రశ్రేణి నక్సలైట్ నేతలను గుర్తించి పట్టుకోవడమే.
ఈ రోజు ఉదయం జరిగిన ఘర్షణలో భద్రతా బలగాలు 22 మంది మావోయిస్టులను మట్టికరిపించాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక మహిళా మావోయిస్టు మృతదేహం పక్కన నుంచి 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ఘటనా ప్రాంతాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నాయి.
సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ఈ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. ధోబే కొండలు, నీలం సరాయి ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అలుబాక శివారులో మరో క్యాంపు ఏర్పాటు చేస్తూ, భద్రతా బలగాలు తమ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తున్నాయి.
డ్రోన్లు, సిగ్నలింగ్ టవర్లు, K9 డాగ్ స్క్వాడ్ సహాయంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు బంకర్లు నిర్మించిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ప్రతి అంగుళాన్ని శోధిస్తున్నాయి. మందుపాతరలు, IEDలపై నిఘా పెంచి, ప్రమాదాలను ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.