ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం వేదికగా మారనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించి, నిర్వహణ బాధ్యతలపై అధికారులతో చర్చించారు. పోటీలు మే 10 నుంచి ప్రారంభమవనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.
పోటీలకు హాజరవుతున్న దేశ, విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, బస, ప్రయాణ ఏర్పాట్లు అత్యుత్తమంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి చిన్న అంశాన్ని ముందుగానే పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. పోటీలు విజయవంతం కావాలంటే సమష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలు కావడంతో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. విమానాశ్రయం, హోటళ్లు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో తిరిగే అతిథులకు సౌకర్యవంతమైన అనుభవం కలిగించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
పోటీలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, నగర శుభ్రత, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత మెరుగుపరిచే అవకాశం ఇదేనని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అన్ని శాఖల సమన్వయంతో పోటీలు విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కోరారు.