కరీంనగర్ జిల్లాలో సోమవారం అరుదైన జాతికి చెందిన నారాయణ పక్షి కనువిందు చేసింది. నలుపు, బూడిద రంగు రెక్కలు, పొడవాటి కాళ్లు, ముక్కుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ఈ పక్షి స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది. అసాధారణంగా ఈ పక్షి అక్కడ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఈ పక్షిని సాధారణంగా నారాయణ పక్షిగా పిలుస్తారు. దీనికి శాస్త్రీయ నామం ఆర్డియా సినిరియా అని ఎస్ఆర్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిర్మణయి తెలిపారు. ఈ జాతి పక్షులు సాధారణంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో విస్తృతంగా కనిపిస్తాయని వెల్లడించారు.
నదులు, సరస్సులు, లేదా తడిచెరువుల దగ్గర జీవించే ఈ పక్షులు, ఎక్కువగా నీటి సమీపంలో ఆహారం కోసం సంచరిస్తాయని చెప్పారు. ఇవి జలజీవులైన చేపలు, చిన్న జీవులను తినడం ద్వారా జీవనోపాధి కొనసాగిస్తాయని వివరించారు. పొడవాటి కాళ్లు, గొట్టంలాంటి ముక్కుతో ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.
అరుదైన ఈ పక్షి మన రాష్ట్రంలో దర్శనమివ్వడం పర్యావరణవేత్తలను, పక్షుల ప్రేమికులను ఉత్సాహానికి లోనిచేసింది. ఇది వాతావరణ మార్పులు, వలసపక్షుల గతికల నేపథ్యంలో చూసినప్పుడు మరింత ప్రాధాన్యం పొందుతోంది. స్థానికులు దీన్ని వీడియోలు, ఫొటోల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.