వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని పై సీఐడీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిపై అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు.
తాజాగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగానికి ఐపీఎస్ అధికారి జాషువా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వెలుగుచూసింది. తాను 2019 నుంచి 2021 వరకు గుంటూరు విజిలెన్స్ విభాగంలో పని చేశానని, తన అధికారిక పదవిలో ఉన్న సమయంలో విడదల రజని తన కార్యాలయానికి వచ్చి స్టోన్ క్రషర్ పై ఫిర్యాదు చేసిందని తెలిపారు.
తనిఖీల్లో భాగంగా స్టోన్ క్రషర్ యజమాన్యం నాటి టీడీపీ నేతలకు అనుకూలమని తేలిందని, అందుకే విడదల రజని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు. విడదల రజని తన ఆధికారం ఉపయోగించి స్టోన్ క్రషర్స్ పై దాడులు చేయించిందని, అధికారిక ఫైళ్లను ట్యాంపరింగ్ చేసి కీలక పత్రాలను తొలగించారని జాషువా వెల్లడించారు.
ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సీఐడీ విచారణలో నిజానిజాలు వెల్లడి కానున్నాయి. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.