బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీనటులకు గల గౌరవం, నిర్మాణ పద్ధతులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ చిత్రంలో నటిస్తున్న సన్నీ డియోల్, ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నిర్మాతలు, బాలీవుడ్ నిర్మాతలు చాలా విషయాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. దక్షిణాదిలో సినిమా నిర్మాణంలో ఉన్న స్పష్టత, నటీనటుల పట్ల గల గౌరవం బాలీవుడ్‌లో తక్కువగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
“నాకు టాలీవుడ్‌లో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు కలిసికట్టుగా పనిచేస్తారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో దర్శకులు చెప్పినట్లు నిర్మాతలు చేసేవారు, కానీ ఇప్పుడు కమర్షియల్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి తగ్గిస్తున్నారు” అని సన్నీ డియోల్ అన్నారు.
ఏప్రిల్ 10న విడుదల కానున్న ‘జాట్’ చిత్రంలో సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా నటించగా, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్‌లో మరిన్ని చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సన్నీ డియోల్ స్పష్టం చేశారు.