స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని స్పాట్ బిల్లింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను, ఆధార్ కంపెనీ తెచ్చిన స్మార్ట్ మీటర్ల కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన కార్మికులు తమ సమస్యను అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది కార్మికులు, అమలాపురం డివిజన్‌లో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టడం వల్ల తాము చేసుకునే పని పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు.
మా కుటుంబ పోషణకోసం మళ్లీ కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేదంటే స్మార్ట్ మీటర్ల అమలును అడ్డుకోవాలి అని కార్మికులు డిమాండ్ చేశారు. వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేసి, తమ బాధను ప్రభుత్వం విన్నవించుకోవాలని కోరారు.
మా కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం దయచేసి చర్యలు తీసుకోవాలి అని కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. స్పాట్ బిల్లింగ్ ఉద్యోగాల తొలగింపు వెనుక అధికారుల ప్రణాళిక ఉందని కార్మికులు ఆరోపించారు.