ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ కరిముల్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ, స్మశాన వాటికలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, మురుగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గారపాడు కట్టమీద 30 సంవత్సరాలుగా నివాసం ఉండే 20 కుటుంబాలకు పక్కా స్థలాలు ఇవ్వాలని కోరారు. అలాగే, గుంటూరు ఛానల్ నల్లమడవాగు అధికరణ పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
సూపర్ సిక్స్ పథకం, ఉచిత ఇసుక, ఫ్రీ బస్సు వంటివి ఎక్కడ ఉన్నాయని సిపిఎం నేతలు ప్రశ్నించారు. విద్యుత్తు త్రూ ఆఫ్ చార్జీలు తక్షణమే తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం 9 నెలలు గడిచినా పేదల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని నేతలు ఆరోపించారు.
ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు దుప్పలపూడి రమేష్ బాబు, కొత్త వెంకట శివ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం నాయకులు హెచ్చరించారు.