అనకాపల్లి జిల్లా, కశింకోట మండలం బయ్యవరంలో జరిగిన ఘోర హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని ఓ మహిళను దుండగులు నరికి హత్యచేసి, ఆమె శరీరాన్ని నడుము నుంచి కింద భాగాన్ని వేరు చేసి దుపట్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు. ఈ అమానుష ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలన చేపట్టారు. దుపట్లో ఒక చేయి, కాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లుగా ఉండొచ్చని కశింకోట సీఐ స్వామి నాయుడు తెలిపారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణమైన చర్యగా భావిస్తున్నారు.
హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. దర్యాప్తు బృందం మహిళ వివరాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. హత్య వెనుక ఉన్న కారణాలను తేల్చేందుకు పోలీసుల ప్రత్యేక బృందం ఏర్పాటైంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగించింది. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.