పట్టణంలో బడి బస్సుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు తగినంత బస్సులు లభించకపోవడం వల్ల, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
పట్టణ అధ్యక్షుడు జి. సూరిబాబు, కార్యదర్శి కె. రాజు మాట్లాడుతూ, జిల్లాలో విద్యార్థులు తరచుగా బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, అందుకే బడి బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కాలేజీ, పాఠశాల విద్యార్థులు ఆలస్యంగా తరగతులకు హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ యాజమాన్యం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బడి బస్సుల సంఖ్య పెంచకపోతే, విద్యార్థులను ఐక్యపరిచి మరింత పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా కార్యదర్శి శిరీష, సోమేష్, పట్టణ కమిటీ సభ్యులు శివ, గుణ, జయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.