కొడవలూరు పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్యకు జరిగిన అవమానకర ఘటనపై కోవూరు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ట్ పేషెంట్ అయిన తన క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సమయంలో, ఎస్సై కోటిరెడ్డి అందరిముందు పెద్దగా అరుస్తూ తనను బెదిరించాడని చెన్నయ్య వాపోయారు. క్లయింట్‌ను కలవనివ్వకుండా, అవసరమైన సమాచారం ఇవ్వకుండా తనపై కేసు పెడతానని బెదిరించాడని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై కోవూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ చెన్నయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల పట్ల పోలీసులు ఇలాంటి ప్రవర్తన చేస్తే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జిల్లా ఎస్పీ తక్షణమే ఎస్సై కోటిరెడ్డిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బార్ అసోసియేషన్ సెక్రటరీ స్టాలిన్ మాట్లాడుతూ, పోలీసులు ప్రజలకు భద్రత కల్పించాల్సినవారే బెదిరింపులకు పాల్పడితే, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రచారం చేస్తూనే, స్టేషన్‌లో దౌర్జన్యానికి పాల్పడితే ప్రజలు పోలీసులను ఎలా నమ్మాలని అన్నారు. అడ్వకేట్ చెన్నయ్యకు జరిగిన అన్యాయంపై నిరసనగా ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీమ్ బాషా, వీరేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే, ఇలాంటి దౌర్జన్యాలను ఉపేక్షించకూడదని అన్నారు. న్యాయవాదులు, ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.