ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో నిన్న జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. సబ్ డీఏఫ్ వెంకటసుబ్బయ్య చేత మడకం రాజేష్‌పై భౌతిక దాడి జరిగిన విషయం తెలుసుకుని, బాధితుడిని పరామర్శించేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆసుపత్రికి వెళ్లారు.
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను చూసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బుట్టాయిగూడెం మండల జనసేన అధ్యక్షుడు బుచ్చిరాజు కూడా ఎమ్మెల్యేతో కలిసి బాధితుడిని పరామర్శించారు. దాడి వెనుక ఉన్న అసలైన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని ఎమ్మెల్యే బాలరాజు ప్రకటించారు. తప్పు చేసిన వారిని ఎంతటివారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. న్యాయమైన విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే బాలరాజు హామీ ఇచ్చారు.