ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పిఠాపురం మండలం నవకొండవరం గ్రామంలో ఉపాధిహామీ పనుల పరిశీలన సందర్భంగా ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేసిన పనులకు జనవరి నెల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినా కూలీలు కనీసం తినడానికి సరిపడా డబ్బును సంపాదించలేకపోతున్నారని మధు పేర్కొన్నారు. పైగా, పనులు చేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమని, నీడ, మంచినీరు, మజ్జిగ, పనిముట్లు వంటి కనీస వసతులు కూడా అందించకుండా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలోనూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు.
ఉపాధిహామీ కూలీలలో వృద్ధులు, వికలాంగులకు పనులు లభించకపోవడమే కాకుండా, వీరికి పని కల్పించమని అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని మధు ఆరోపించారు. రోజుకు ₹600 వేతనంతో 200 రోజులపాటు పని కల్పించాలని, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఏ అధ్యక్షుడు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాక రామకృష్ణ, వాసంశెట్టి బాబురావు, వాసించేటి మని, చీకట్ల చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ కూలీల వేతనాలు వెంటనే చెల్లించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు.