తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలపై ఇంటర్ బోర్డు కీలక సడలింపు ఇచ్చింది. ఇన్నాళ్లూ అమలులో ఉన్న ఒక నిమిషం నిబంధనను తొలగించి, 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నారు. రేపటి నుంచి (మార్చి 5) ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుండగా, 9.05 వరకు విద్యార్థులు హాల్‌లో ప్రవేశించవచ్చు. 8.45 నుంచి 9 గంటల మధ్య ఓఎంఆర్ షీట్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈసారి పరీక్షల్లో మరిన్ని మార్పులు చేశారు. హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ద్వారా విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ప్రశ్నపత్రాల్లో సీరియల్ నంబర్‌ను ముద్రించడం వల్ల, ఏ పేపర్ ఏ విద్యార్థికి వెళ్ళిందో గుర్తించడం సులభమవుతుంది. ఈ విధానం వల్ల ప్రశ్నపత్రం లీకైనా, అది ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
పరీక్షల నిర్వహణను మరింత కట్టుదిట్టంగా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక స్క్రీన్‌ను ఏర్పాటు చేసి పర్యవేక్షణను బలోపేతం చేశారు. ఏదైనా ప్రశ్నపత్రంలో పొరపాట్లు ఉంటే, పరీక్ష ప్రారంభమైన తర్వాతే సవరించుకోవాలి. విద్యార్థులకు ఒత్తిడి పెరగకుండా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,97,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య 1,915 మందిగా అధికంగా ఉంది. పరీక్షలకు ముందు మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్ 14416 లేదా బోర్డు హెల్ప్‌లైన్ 92402 05555కు సంప్రదించవచ్చు.