ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు కూడా ఈ సఫారీకి హాజరయ్యారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ఆసియా సింహాల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ, గిర్ అడవుల్లో సఫారీ చేయడం తనకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని అన్నారు. ముఖ్యంగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో గిర్ అడవులను అభివృద్ధి చేయడంలో తన ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆసియా సింహాల జనాభా పెరిగిందని, ఇది కృషి ఫలితమని తెలిపారు.
సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సమూహాలు, చుట్టుపక్కల గ్రామాల మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. భారతదేశం వన్యప్రాణుల సంరక్షణలో ముందంజలో ఉందని, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో దేశ ప్రజల బాధ్యత ఎంతో ఉందని స్పష్టంగా తెలిపారు.
సఫారీ అనంతరం మోదీ గిర్ అడవుల్లో తన అనుభవాలను పంచుకుంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆసియా సింహాల విశిష్టతను తెలుసుకునేందుకు గిర్ అడవులను సందర్శించాలని ప్రజలకు సూచించారు. భారత ప్రభుత్వం వన్యప్రాణుల పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.



