నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి చిరంజీవి డ్యాన్స్‌కి ఫిదా అయ్యానని, ఆయన డ్యాన్స్ చూసి తాను డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రి’ సినిమాను ఎన్నిసార్లు చూసినా తృప్తిపడేదాన్ని కాదని చెప్పారు.
సాయి పల్లవి మాట్లాడుతూ, “చిన్నప్పుడు చిరంజీవి గారి డ్యాన్స్ చూసి నాకు డ్యాన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితో వివిధ షోలలో పాల్గొన్నాను. నా జీవితంలో చిరుతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం ఓ అద్భుత అనుభూతి. అది నా జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకం” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌ను ఆనందపరిచాయి.
ఇటీవల ‘తండేల్’ మూవీతో సాయి పల్లవి తెలుగులో ఘన విజయం అందుకున్నారు. ‘ఫిదా’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, ‘ఎంసీఏ’, ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు డ్యాన్స్‌లోనూ ప్రత్యేకతను ప్రదర్శించారు.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’ మూవీలో సీత పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌తో ఆమె హిందీ పరిశ్రమలో తన స్థానం ఏర్పరచుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రేరణగా తన కెరీర్‌లో ఈ స్థాయికి వచ్చానని చెప్పిన సాయి పల్లవి వ్యాఖ్యలు ఆమె అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి.