టీమిండియా మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారని ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు హాజరైన వారిద్దరూ కౌన్సెలింగ్ తర్వాత విడాకుల కోసమే నిర్ణయించుకున్నారని, కోర్టు విడాకులు మంజూరు చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని ధనశ్రీ తరపు లాయర్ అదితీ మోహన్ స్పష్టత ఇచ్చారు.
ధనశ్రీ లాయర్ ప్రకారం, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. ‘‘ఇది సబ్ జుడీస్ అయినందున ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. మీడియా వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వార్తలు ప్రచురించాలి. అవాస్తవ సమాచారాన్ని ప్రజల్లో వ్యాపించనివ్వకూడదు’’ అని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలో చాహల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించాడు. ‘‘ఇదంతా గందరగోళంగా ఉంది. దయచేసి నిజాలను తెలుసుకొని స్పందించండి’’ అని పేర్కొన్నాడు. మరోవైపు, ధనశ్రీ రూ. 60 కోట్ల భరణం కోరినట్లు వార్తలు వచ్చినా, ఆమె కుటుంబం దీనిని ఖండించింది. అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని, మీడియా కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ప్రచురించాలని కోరింది.
చాహల్, ధనశ్రీ ఇద్దరూ సోషల్ మీడియాలో గమనార్హమైన పోస్టులు చేశారు. చాహల్ తన పోస్టులో భగవంతుడు తనను అనేకసార్లు రక్షించాడని పేర్కొనగా, ధనశ్రీ ‘‘ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు’’ అనే క్యాప్షన్‌తో భగవంతుడిపై విశ్వాసమే జీవితంలో మంచి మార్పులకు దారి తీస్తుందని చెప్పింది. వారి వ్యక్తిగత జీవితం గురించి నిజాలు త్వరలోనే బయటకు రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు.