శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఎన్టీఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రమైంది. 7వ, 8వ వీధుల్లో నెలరోజులుగా నీరు రాకపోగా, 9వ వీధికి మూడు నెలలుగా త్రాగునీరు అందడం లేదు. దీంతో స్థానిక మహిళలు గ్లాస్, చెంబులు పట్టుకుని నిరసనకు దిగారు. కాలనీలో బావులు ఎండిపోవడంతో పాటు, 400 అడుగుల లోతు ఉన్న బోర్లకు కూడా నీరు అందడం లేదు.
నీటి కొరత కారణంగా స్థానికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రక్క వీధుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లినా అక్కడి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తమ సమస్యను టెక్కలి డివిజన్ అధికారులకు తెలియజేసినా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు కాలనీవాసులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరువు పరిస్థితుల కారణంగా ట్యాంక్ ద్వారా సరఫరా అవుతున్న నీరు సరిపోవడం లేదని కాలనీవాసులు చెబుతున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి వెంటనే పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని, అవసరమైతే కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని బాగాది శ్రీదేవి, కూన సుభద్ర, పి సుమిత్ర, జి జ్యోతి తదితరులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే, అదనంగా నీటి ట్యాంకులు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. అవసరమైన నీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే, సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.