తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం 70 నుంచి 100 మందితో గుంపులుగా విడిచిపెడుతున్నారు.
12ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం తర్వాత నడక మార్గంలో అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణను పెంచారు.
తిరుమల పరిసరాల్లో చిరుతల సంచారం పెరుగుతుండటంతో టీటీడీ అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. గురువారం రాత్రి భక్తులు ముగ్గు బావి సమీపంలో చిరుతను గుర్తించారు. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై పెద్ద శబ్దాలు చేసి దాన్ని అడవిలోకి తరిమారు.
భక్తుల భద్రత కోసం టీటీడీ మరింత కఠిన చర్యలు చేపట్టింది. నడక మార్గంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చిరుత భయంతో భక్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, నడక మార్గంలో గస్తీని పెంచారు.