గన్నవరం టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది అరెస్ట్ అయ్యారు.
తాజాగా సత్యవర్థన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనను పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేసి కోర్టుకు సమర్పించారు.
ఈ కేసుకు సంబంధించి కొన్ని నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కింది కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో నిందితులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న విచారణ ప్రారంభమైంది.
సత్యవర్థన్ అఫిడవిట్ సమర్పించడంతో ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై విచారణ నేటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.