జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో శనివారం నుంచి ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కిరణ్ రాయల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా, తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వివాదంపై జనసేన అధిష్టానం స్పందించింది. కిరణ్ రాయల్ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా, విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆదివారం విడుదలైన ప్రకటనలో పార్టీ ఈ నిర్ణయాన్ని న్యాయసమ్మతంగా తీసుకున్నట్లు వెల్లడించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వివాదం నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కూడా జనసేన కీలక సూచనలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని, వ్యక్తిగత విషయాలను పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. పార్టీ పేరు చెడిపోకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అయితే ఈ వ్యవహారంపై స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. కిరణ్ రాయల్‌కు పార్టీ కార్యక్రమాలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని, పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.