తెలుగు, తమిళ భాషల్లో సముద్రఖని నటనకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు ప్రధాన పాత్రల్లోనూ మెరిసిపోతున్నారు. ఆయన లీడ్ రోల్ లో వచ్చిన తాజా తమిళ సినిమా ‘తిరు మాణికం’. ఈ చిత్రానికి నంద పెరియస్వామి దర్శకత్వం వహించారు.
గతేడాది డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, జనవరి 24 నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం అవుతోంది. అయితే, ఈ సినిమా ప్రస్తుతానికి తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. సినిమా కథ, నెరేషన్ బలంగా ఉండడంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇందులో భారతీరాజా, అనన్య కీలక పాత్రలు పోషించగా, ఆర్య, పార్తీబన్, పా విజయ్ గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
కథ విషయానికి వస్తే, మాణికం అనే వ్యక్తి లాటరీ షాప్ నడుపుతుంటాడు. అతను నిస్వార్థంగా, నిజాయితీగా జీవించే వ్యక్తి. ఓ వృద్ధుడు అతని షాప్‌లో లాటరీ టికెట్ కొంటాడు. డబ్బుల్లేవని, తర్వాత తీసుకుంటానని చెబుతాడు. ఆ టికెట్‌కి కోటిన్నర లాటరీ తగలడంతో, ఆ డబ్బు అందజేయాలని భావించిన మాణికం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు.
తమిళంలో ఈ సినిమా మంచి స్పందన పొందడంతో, త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సముద్రఖని నటన, చిత్ర కథ, ఎమోషనల్ డ్రామా సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి.