కుల గణనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కుల గణన ఫారంను దహనం చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ వ్యవహారంపై తీన్మార్ మల్లన్న త్వరలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
కుల గణన శాస్త్రీయంగా నిర్వహించామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీసీల శాతం 56కి పైగా ఉందని తెలిపారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ నేతలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావద్దని సూచించారు.
పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనను సహించబోమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా పార్టీ శాసనాలకు కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ నేతలు విధిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాలని తెలిపారు. రేపటి కాంగ్రెస్ సమావేశంలో అన్ని అంశాలను చర్చిస్తామన్నారు.
కుల గణన, ఎస్సీ వర్గీకరణ బీసీ, ఎస్సీల కలను సాకారం చేశాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. బీహార్‌లో కూడా కుల గణన చేపట్టినా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ప్రతిపక్షాలు విమర్శలకు బదులుగా సలహాలు ఇవ్వాలని సూచించారు.